అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ జగన్ మీడియాలో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు, వాటికి మద్దతుగా కొమ్మినేని తీరుతో అంటుకున్న మంట ఇప్పటిలో చల్లారేలా లేదు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో స్పందించింది. తాజాగా ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్, ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీకి ఓ లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. కృష్ణంరాజుపై తీసుకున్న చర్యల నివేదికను మూడు రోజులలోగా సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఇక ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు. పలు ప్రాంతాలలో సాక్షి కార్యాలయాల ముందు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆ ఆందోళనలు చేస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.