ఎట్టకేలకు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులుగా న్యాయవాది, శాసనమండలి మాజీ సభ్యులు నారపరాజు రామచందర్ రావు ఎన్నికయ్యారు. ఆయనకు బాహ్య సవాళ్ల కంటే అధికంగా అంతర్గత సవాళ్లే స్వాగతం పలుకుతున్నాయి. రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవమని బీజేపీ జాతీయ పరిశీలకురాలు శోభా కరద్లాంజే ప్రకటించినప్పటికీ, నామినేషన్ల పర్వంలోనే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ సీనియర్ శాసనసభ్యుడు రాజాసింగ్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ కార్యాలయం వద్దే ప్రకటించారు. ఆయన అతివాద హిందూత్వవాదిగా పేరు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత వరుసగా మూడు సార్లు బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యే. గత శాసనసభలో ఆ పార్టీ తరఫున కూడా ఆయనొక్కరే గెలిచారు. వర్తమాన శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది మంది బీజేపీ సభ్యులలో రాజాసింగ్ మినహా, మిగతావారంతా కమలం గుర్తుపై మొదటిసారి ఎన్నికైన వారే. రాజీనామా ద్వారా విసిరిన సవాలు నూతన అధ్యక్షుడు రామచందర్‌రావుకు ఒక సవాలే. బీజేపీలో కొత్త, పాత నాయకుల మధ్య అంతరాలకు తోడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యక్తులుగా, బృందాలుగా విడిపోయారనేది సర్వవిదితమే. శాసనసభ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన నాటి అధ్యక్షుడు బండి సంజయ్‌ను అకస్మాత్తుగా తొలగించి, పాతకాపు కిషన్‌రెడ్డికి కాషాయ పార్టీ అధిష్టానం పగ్గాలను కట్టబెట్టింది.
ఆయన పదవీ కాలం పూర్తయి గడిచినప్పటి నుంచి, ఆ పార్టీలో అనేక మంది ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వారిలో బైట పార్టీ నుంచి వచ్చిన ఎంపీ ఈటల రాజేందర్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌ల మధ్యే పోటీ కేంద్రీకృతమైందనే వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో అనూహ్యంగా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీతో మమేకమైన రామచందర్‌రావుకు ఆ పదవి దక్కింది. ఈ పరిణామం ముఖ్యంగా ఈటల రాజేందర్‌ను నిరాశకు గురి చేసిందనే చెప్పవచ్చు. అలాగే బైట పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారిని అభద్రతలోకి నెట్టివేసింది. కొత్తగా చేరాలనుకునేవారు పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే, గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపిలో నుంచి బీజేపీలో చేరిన నాగం జనార్ధన్‌రెడ్డి, జగ్గారెడ్డి, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి వంటి అనేక మంది క్రియాశీల నాయకులు, అందులో ఇమడలేకపోయారు. రాష్ట్ర రాజకీయాలలో తమ పాత పార్టీలో కంటే అధిక ప్రాధాన్యం లభిస్తుందని బీజేపీలో చేరిన తరువాత, గతం కంటే ప్రాధాన్యత తరిగిపోవడం అలాంటి వారికి మింగుడు పడక వేరే దార్లను వెతుక్కోవాల్సి వచ్చింది. ఈటలకు అధ్యక్ష పదవి నోటి దాకా వచ్చి వెనక్కి పోవడంతో తమ గతేమిటనే భావన ఇతర పార్టీలో నుంచి బీజేపీలో ఉన్న ప్రస్తుత నేతల్లో కమ్ముకుంది. మరోవైపు బీజేపీలో ఎదిగొచ్చిన యువనేతలు తమ ఎదుగుదలను పాత తరం లాబీ అడ్డుకుంటుందనే అసహనంతో ఉన్నారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ కొత్త అధ్యక్షుడి పదవీ స్వీకార కార్యక్రమానికి వ్యక్తిగత కారణాలను చూపి గైర్హాజరవడం కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి బీజేపీ శ్రేణుల్లోనే ఒకలాంటి నిరాశ ద్యోతకమైనట్లుగా వార్తలు తెలుస్తున్నాయి. మరో ముఖ్యవిషయం బీసీని అధ్యక్ష పదవికి ఎన్నిక చేయకపోవడం. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనే వాగ్దానమే ఇందుకొక ప్రధాన కారణం. అధికారంలోకి రాలేకపోయినప్పటికీ, తమ మాటకు బలం చేకూర్చేందుకైనా కనీసం ఎన్నికైన బీజేపీ బీసీ ఎమ్మెల్యేలలో ఒకరికి శాసనసభానాయకత్వాన్ని కట్టబెడతారేమోనని అనుకున్న విశ్లేషణలు పటాపంచలయ్యాయి. దీంతో బీసీ వర్గాలలో బీజేపీపై భ్రమలు పలుచబారాయి. అందుకు పరిహారంగానా అన్నట్లుగా బండి సంజయ్‌ను కేంద్ర సహాయ మంత్రిని చేయడం సహా, బీసీ ఉద్యమకారుడు ఆర్.కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి తరపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి, బీజేపీ తరపున తిరిగి పెద్దల సభకు పంపారు. ఒకవైపు అధికార కాంగ్రెస్ బీసీ జనగణన చేపట్టి, రాష్ట్ర అధ్యక్షుని సహా, పదవుల్లో కీలక స్థానాలను బీసీలకు కట్టబెడుతుంటే, బీజేపీ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
బీసీ సీఎంను చేస్తామన్న మాట అటుంచి, కనీసం బీజేఎల్పీ నేతగానైనా ఆ బీసీని చేయకపోగా, ఊరించి చివరకు అధ్యక్ష పదవి విషయంలో కూడా నిరాశ పరిచిందనే అభిప్రాయం సొంత పార్టీ బీసీలలోనే వ్యక్తమవుతోంది. బైటి సవాళ్ళ విషయానికొస్తే, తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు గంటున్న బీజేపీకి ప్రజల నుంచి ఎదురవుతున్న అత్యంత ముఖ్యమైన సవాలు కేంద్రంలో పదకొండేళ్ళుగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేకించి ఒరగబెట్టిందేమిటని? నదీ జలాలు, ప్రాజెక్టులు, మెట్రో రైలు విస్తరణ, విమానాశ్రయాలు, నిధులు తదితర అంశాలపై తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేస్తున్న చురకలకు బీజేపీ సమాధానం చెప్పలేక సతమతమవుతున్నది. రాష్ట్ర నూతన సారథికి ఇవి గడ్డు సవాళ్ళే.