prajapaksham

సమానత్వంపై ప్రపంచ బ్యాంక్‌ నివేదిక మోసపూరితం

జులై 5, 2025 నాడు భారత ప్రభుత్వం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెబ్‌సైట్‌పై “అసమానతను తగ్గించడంలో భారత్‌ గాథ”ను ప్రచురించింది. అందులో మూడు అంశాలున్నాయి. 1. 25.5 గినీ స్కోరుతో ఆదాయ సమానత్వంలో ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది; 2. దుర్భర దారిద్య్రం 2022 నాటికి 2.3 శాతానికి తగ్గినట్లు ప్రపంచ బ్యాంక్‌ చెబుతోంది; 3. 2011 మధ్య 17.1 కోట్ల భారతీయులు దుర్భర దారిద్య్రం నుంచి బయటపడ్డారు.

తమ ప్రభుత్వ సాఫల్యాలపై గొప్పలు చెప్పుకునేందుకై నిర్వచనాలు మార్చి, అంకెలు తారుమారు చేసి తప్పుడు సమాచారం సృష్టించడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం దిట్ట అనే అనుమానాలు ఎప్పుడూ ఉన్నాయి. తమ పనితీరుకు విశ్వసనీయత చేకూర్చేందుకు ఇతర సంస్థలను ఉటంకించడానికి నరేంద్ర మోదీ, ఆయన అధికారులు ఎంతో ఇష్టపడతారు. భారత్‌ ప్రపంచ బ్యాంకు డేటాను ఉటంకించడం తాజా ఉదాహరణ. ప్రపంచ బ్యాంకు తమ “దారిద్య్రం, అసమానత” ప్లాట్‌ఫాంపై “ప్రభుత్వ గణాంక ఏజెన్సీల నుంచి పొందిన ప్రాథమిక గృహ సర్వేపై మా డేటా ఆధారపడింది” అని పేర్కొన్నది. భారత ప్రభుత్వం, దాని సంస్థల తప్పుడు సమాచారాన్ని ప్రపంచ బ్యాంక్‌ కాపీ చేసి, పేస్ట్ చేసి, ఫార్వార్డ్‌ చేసినట్లయితే దాని అంచనా తప్పు అవుతుంది. దారిద్య్రం, అసమానత, ఉపాధి భారతదేశాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వాటికి అంతర్‌ సంబంధం ఉంది. వీటిపై భారత ప్రభుత్వ సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ అంశాలకు రాజకీయ ప్రాధాన్యత ఉండటంతో అవి ఎన్నికల్లో లేవనెత్తబడుతుంటాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, ఇతర అధికారులు ఈ తప్పుడు గొప్పలే చెప్పుకున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి, కార్మిక మంత్రి, ప్రధానమంత్రి చెప్పుకున్నారు. ప్రభుత్వానికి సొంత డేటా లేనందున రిజర్వ్‌బ్యాంక్‌ కెఎల్‌ఇఎంఎస్‌ డేటా ఉటంకించారు. 2020, 2021 సంవత్సరాలు కోవిడ్‌ ఆర్థిక వ్యవస్థ మూలన పడిన సంవత్సరాలు. ఆ రెండు సంవత్సరాల్లో ఉపాధి కల్పనపై రిజర్వు బ్యాంకు ఇచ్చిన సమాచారమే అదెంత తప్పుల తడకో తెలియజేస్తున్నది. ఉపాధిలో 2020లో 31.2 శాతం పెరుగుదల, 2021లో 11.9 శాతం పెరుగుదల ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. జీడీపీ వృద్ధి (-5.8గా తిరోగమనంలో ఉన్న 2020లో ఉపాధి పెరగటం ఎంతో ఆశ్చర్యకరం.

ఉపాధి ప్రజలకు ఆదాయం ఇస్తుంది. అది బదులుగా దారిద్య్రం, అసమానత తగ్గిస్తుంది. ఉపాధి కల్పనపై తప్పుడు సమాచారం దారిద్య్రం, అసమానత తగ్గిదలపై తప్పుడు సమాచారం ఇస్తాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన డేటాలో 19 శాతం వేతనం చెల్లింపు లేని వ్యక్తులున్నారు. ఎవరు వీరు? ఇంట్లో పనులకు ఏదో కొంత సహాయపడేవారు!

ఇప్పుడు ప్రపంచ బ్యాంకు గినీ స్కోరు (25.5) తీసుకుందాం. తమ సమాచారం ప్రభుత్వం ఇచ్చిన డేటాపై ఆధారపడిందని బ్యాంకు చెప్పినందున ప్రభుత్వ డేటాలో తప్పులు బ్యాంక్‌ అంచనాను తప్పు చేస్తాయి. గినీ స్కోరు ఆధారంగా అసమానత లెక్కిస్తారు. భారత ప్రభుత్వం కొద్దికాలం క్రితమే ‘నిలకడైన అభివృద్ధి గమ్యం జాతీయ సూచిక చట్రం ప్రగతి నివేదిక, 2025’ను విడుదల చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల తరుణంలో నీతి ఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బివిఆర్‌ సుబ్రహ్మణ్యం దేశంలో దారిద్య్రం 5 శాతం దిగువకు తగ్గిందని చెప్పారు. కాగా దుర్భర దారిద్య్రం 2022 నాటికి 2.3 శాతానికి తగ్గినట్లు ప్రపంచ బ్యాంకును ఉటంకించిన ప్రభుత్వ ప్రకటన చెబుతున్నది. 2011-12లో దారిద్య్రరేఖకు నిర్ధారించిన తలసరి వినిమయం రోజుకు రూ.32. దాన్ని ఆ రోజుల్లో మెజారిటీ ప్రజలు తిరస్కరించారు. తలసరి వినిమయానికి సంబంధించి భారత ప్రభుత్వ 2022 డేటాను గుణకార పద్ధతిలో హెచ్చరించి నీతి ఆయోగ్‌ ఆ నిర్ధారణకు వచ్చింది. అపసవ్యమైన ఆ డేటాను భారతదేశానికి గినీ స్కోర్‌ నిమిత్తం ప్రపంచం బ్యాంకు తీసుకుంది. తలసరి వినిమయ వ్యయం లెక్కింపునకు 2022 పద్ధతి మార్పు చేయబడింది. 2022 తలసరి వినిమయ వ్యయ సర్వే ఫలితాలను పోల్చి చూసేటప్పుడు ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలని ఆ సర్వే హెచ్చరించింది కూడా. అయితే ఈ హెచ్చరికను ప్రపంచ బ్యాంకు ఏమాత్రం పాటించినట్లు లేదు.

తలసరి వినిమయ వ్యయ సర్వే 2022 పరిగణనలోకి తీసుకున్న వస్తువులను 2011లో 307 నుంచి 405కు పెంచింది; పాత జాబితా నుంచి అనేక వస్తువులను తొలగించింది. సర్వే ఒక ప్రశ్నపత్రం బదులు మూడు ప్రవేశపెట్టింది. ఆహార వస్తువులపై, వినిమయ పదార్థాలు, సేవా ఐటమ్స్‌పై, మన్నిక గల వస్తువులపై వేర్వేరు ప్రశ్నాపత్రాలు ఉపయోగించింది. కుటుంబ ప్రత్యేకతలు, కుటుంబ సభ్యుల వయో వివరాలపై సమష్టి సమాచారం కోసం మరో ప్రశ్నపత్రం కూడా ఉంది. ఆ విధంగా డేటా సేకరించడం డేటా ఫలితాలను గుణాత్మకంగా మార్పు చేసింది. వినిమయం, దారిద్య్రంపై మెరుగైన దృశ్యం చూపేందుకు అది ప్రభుత్వానికి ఉపకరించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు క్షీణించినప్పటికీ అది దేశ గినీ స్కోరుని మార్చింది. ఆ విధంగా వచ్చిన సగటు నెలసరి తలసరి వ్యయం అంచనా గ్రామీణ జనాభాలో కింది 5 శాతం మందికి నెలకు రూ.1373, ఉన్నత స్థాయి 5 శాతం మందికి రూ.10,501. పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్యలు వరుసగా రూ.2001; రూ.20,824. గణాంకాలను తారుమారు చేసినాక కూడా అసమానత స్పష్టం. ఉచిత ఆహారం విలువను, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, మొబైల్‌ ఫోన్లు, సైకిళ్లు, చెప్పులు, ఆర్థిక సహాయం వంటి ఆహారేతర ఐటమ్‌లను కూడా డేటాలో చేర్చాక వచ్చిన పరిస్థితి అది. వస్తువు లేదా నగదు రూపంలో పేదలకిచ్చే సహాయం దారిద్య్రాన్ని ఒకింత భరింపశక్యం చేస్తుంది గానీ నిర్మూలించదని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల సహాయం విలువను దారిద్య్ర నిర్మూలనపై డేటా సృష్టించడానికి జత చేయడం తప్పు. ఒక మనిషి తన అస్తిత్వానికి సరిపడా సంపాదించడం మొదలుపెట్టినప్పుడే దారిద్య్రం నిర్మూలన అవుతుంది. ప్రభుత్వ సహాయం, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

ఆహార భద్రత చట్టం కింద అంచనా ప్రకారం 2012లో పేద ప్రజలు సుమారు 81 కోట్లు. పీఎంజీకేఏవై ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వడం 2020లో ప్రారంభించింది. అది ఈరోజుకూ కొనసాగుతున్నది. 2029 వరకు కొనసాగుతుంది. పీఎంజీకేఏవై కింద పేదల సంఖ్య ఎందుకు తగ్గడం లేదు? పై నివేదికలోని మూడవ అంశం 2011 మధ్య 17.1 కోట్ల మంది భారతీయులు దుర్భర దారిద్య్రం నుంచి బయటకు వచ్చారు. అదే నిజమైతే పీఎంజీకేఏవై కింద పేదలు ఎందుకు తగ్గలేదు? జనాభా లెక్కల సేకరణలో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే, జాతీయ ఆహార భద్రత చట్టం కింద మరో 14 కోట్ల మంది ఉచిత ఆహార ధాన్యాలకు అర్హులవుతారు. ఆహార ధాన్యాల ఉచిత సరఫరా వల్ల పేదలు దారిద్య్రం నుంచి బయటకు వచ్చారనే మోదీ ప్రభుత్వ, ప్రపంచ బ్యాంకు ఊహ గణాంకాల తారుమారు మాత్రమే. అందువల్ల మోదీ ప్రభుత్వ ప్రస్తుత కథనం తప్పు. భారతదేశం సృష్టించిన తారుమారు డేటా ఆధారంగా ప్రపంచ బ్యాంకు తయారుచేసిన గినీ స్కోరు వాస్తవానికి మోసపూరితమైనది.

(ఐపిఎ సర్వీస్‌)

Recent Post

Andhra Pradesh National