prajapaksham

బీఆర్‌ఎస్‌ దుందుడుకు రాజకీయం: మీడియా దాడులు, సెంటిమెంట్‌ ఆటలు – ప్రజాస్వామ్యానికి సవాలు

ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) దుందుడుకుగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో విధంగా ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నం సాగించింది. అది హైడ్రా విషయంలో గానీ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పక్కనుండే కంచె గచ్చిబౌలి భూముల విషయంలో గానీ చేసిన రాద్దాంతం అందరికీ గుర్తే. ఇటీవల డోసును మరింత పెంచి, ఏదోరకంగా ఇబ్బందులు సృష్టించడంలో తలమునకలై ఇరకాటంలో పడుతోంది బీఆర్‌ఎస్‌. అయినా తన ధోరణిని మార్చుకోవడం లేదు.

హైదరాబాద్‌లోని ఒక తెలుగు మీడియా ఛానెల్‌ ప్రధాన కార్యాలయంపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన ఉదంతం, తదనంతరం నాయకులు చేసిన ప్రకటనలు బీఆర్‌ఎస్‌లో పెరిగిన అసహనానికి దర్పణం పడుతోంది. నిజానికి ఆ మీడియా సంస్థ తమ యూట్యూబ్‌ ఛానెల్‌లో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేత కేటీఆర్‌కు సంబంధించి పెట్టిన వీడియోల థంబ్‌నెయిల్స్‌ వాడిన భాష అభ్యంతరకరమైనదే. కానీ, బీఆర్‌ఎస్‌ ఆ అంశాన్ని ఎత్తి చూపి ఉంటే, దానిపై చర్చ జరిగేది. అలా కాకుండా ఏకంగా గులాబీ పార్టీ కార్యకర్తలు ఆ ఛానెల్‌ కార్యాలయానికి వెళ్ళి వీరంగం సృష్టించడంతో అసలు విషయం పక్కకు తొలగింది. రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ ఉద్యమం, పిమ్మట అధికారంలో ఉన్న పార్టీ ఎన్నడూ ఇలాంటి దాడులకు పాల్పడకపోవడమే కలిసి వచ్చింది. ఇప్పుడు దాడి చేయడమే కాకుండా, అడ్డంగా సమర్థించుకున్న తీరు ఆ పార్టీ పట్ల సానుకూలంగా ఉండే వారిలో కూడా ఏహ్యత కలిగించింది. పైగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా లేని విధంగా అతివాదంతో వ్యవహరిస్తూ, హైదరాబాద్‌లో స్థిరపడిన పొరుగు తెలుగు రాష్ట్రానికి సంబంధించి దూకుడుగా చేసిన వ్యాఖ్యలు సరైన సంకేతాలను పంపడం లేదు. నిజానికి గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపొందిన స్థానాలలో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నుండే ఉన్నాయి. అందులో కూడా సెటిలర్‌లు ఎక్కువ ఉన్న చోట్ల భారీ మెజారిటీనే సాధించింది. ఉన్నట్లుండి బీఆర్‌ఎస్‌ భిన్న వైఖరి ప్రదర్శించడం సందేహాలకు తావిస్తోంది.

రాజకీయ వ్యూహాలు, సెంటిమెంట్ రాజకీయాలు
గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణవాదం బలంగా ఉన్న ప్రాంతాలలో బీఆర్‌ఎస్‌ గెలుపొందలేకపోయింది. గతంలో ఉద్యమానికి దన్నుగా నిలిచిన ఉత్తర తెలంగాణ, గ్రామీణ తెలంగాణ ప్రాంతాలలో కూడా ఓట్లు తగ్గాయి. త్వరలో స్థానిక ఎన్నికలు జరుగనుండడంతో తమకు దూరమైన తెలంగాణ వాదాన్ని తిరిగి ఉపయోగించుకునేందుకే ఈ తతంగమనే మాట వినపడుతోంది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణపై దృష్టి పెట్టనున్నట్లు సంకేతాలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం తొలి ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, అనంతరం పరిణామాల్లో ఆంధ్రకే పరిమితమైంది. అప్పుడు ఇక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో సింహభాగం బీఆర్‌ఎస్‌ బాట పట్టారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు, కేంద్రంలో దానిపై ఆధారపడిన బీజేపీ ప్రభుత్వం ఉండడంతో బీఆర్‌ఎస్‌లో ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలు, తెలంగాణలో కూడా కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతున్నది. కేంద్రంలో, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఒకవేళ దృష్టి సారిస్తే తమ పార్టీలో ఉన్న పాత టీడీపీ శ్రేణులు ఆ పార్టీ వైపు మొగ్గుతాయేమోననే అనుమానాలు కూడా బీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతున్నాయి.

కాబట్టి నష్టనివారణలో భాగంగా, తాము అధికారంలో ఉన్నప్పుడు మరిచిన తెలంగాణ సెంటిమెంట్‌ను తిరగదోడి, కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అందుకే బనకచర్ల విషయంలో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా, గతంలో వారి ప్రభుత్వమే గోదావరి జలాలను రాయలసీమకు పంపొచ్చని చేసిన అధికారిక ప్రకటనల ముందు అది పని చేయకుండా పోతుంది. అందుకే నీటి పేరుతో ఎంత రెచ్చగొట్టినా సెంటిమెంటు ఫార్ములా పని చేయడం లేదు. నిస్పృహ, అసహనంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతిపక్ష పార్టీ ఏదో ఒక అంశంతో రెచ్చగొట్టేందుకు వెనుకాడటం లేదు. అసెంబ్లీలో చర్చకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలుపై కేటీఆర్‌ తనతో చర్చకు రావాలని ప్రెస్‌క్లబ్‌కు వెళ్ళిన తీరూ వారికి ఆశించిన ఫలితమివ్వలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టమొచ్చినట్లు తూలనాడడమే పనిగా పెట్టుకొని, వితండవాదానికి దిగుతున్న వైనాలు కూడా ద్యోతకమవుతున్నాయి. సోషల్‌ మీడియా వార్‌కు తోడు ఇటీవల ఒక ఛానెల్‌లో జరిగిన చర్చలో కాంగ్రెస్ నేతపై ఒక బీఆర్‌ఎస్‌ నేత చేయి చేసుకున్న తీరు అందుకు పరాకాష్ఠ.

రాజకీయ వాతావరణం, ప్రతిపక్షాల బాధ్యత
ఇది రాజకీయ అనారోగ్య వాతావరణానికి దారితీసి, పరిస్థితి చేజారిపోయే ప్రమాదం కనపడుతోంది. ఇప్పటికైనా ఇలాంటి విపరిణామాలకు చెక్ పెట్టాల్సిన గురుతర బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉన్నదని విజ్ఞులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, జవాబుదారీని చేసేందుకు, తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వ్యక్తీకరించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, వారిని తమ వైపు తిరిగి మలుపుకునేందుకు ప్రతిపక్షానికి చట్టసభ (అసెంబ్లీ)నే అత్యున్నత ప్రజాస్వామిక వేదిక.

Recent Post

Andhra Pradesh National