అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి నియంతృత్వమా లేక వెర్రితనమా? ఈరోజు ఏమి మాట్లాడతారో, అదే అంశంపై రేపు ఉదయం ఏమి మాట్లాడుతారో అర్థం కాక ప్రపంచ నాయకులు గందరగోళ పడుతున్నారు. తాను అధికారంలోకి రాగానే ముగింపచేస్తానన్న గాజా యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి. ‘అమెరికాను తిరిగి గొప్ప దేశం చేయటం’ ఆయన నినాదం కాబట్టి తొలుత సుంకాల ఆదేశాలతో ప్రపంచ దేశాలను భయకంపితం చేశారు, గందరగోళం సృష్టించారు. ఆ బెదిరింపులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా బ్రిక్స్ దేశాలపై, ఐరాసపై దాడికి దిగారు.
ప్రజాస్వామ్యానికి పుట్టిల్లు అయిన అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం యుద్ధాలు ఎగదోయడం, ఆయుధాలు అమ్ముకోవడం, స్వయంగా దురాక్రమణ యుద్ధాలు చేయడం, సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, సప్త సముద్రాల్లో యుద్ధ నౌకల మోహరింపుతో భీకరమైన శక్తిగా కొనసాగటం దాని విదేశాంగ నీతిలో అతి ముఖ్యాంశం. సోవియట్ యూనియన్ పతనం, అలీనోద్యమం నిర్జీవంతో ఏకధృవ ప్రపంచం కోసం అమెరికా చేస్తు న్న సామ దాన భేద దండోపాయాలు ఫలించలేదు. ఇప్పుడు మిస్టర్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికా పాలకుల విధానాలను విమర్శించే వారిని, డాలర్‌కు ఏదైనా దెబ్బ తగులుతుందేమోనన్న భయాన్ని భరించలేకపోతున్నారు. రష్యా, చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా తదితర 10 దేశాలతో కూడిన బ్రిక్స్ ను చూసి బెదురుతున్నారు. బ్రిక్స్‌తో సంబంధం పెట్టుకున్న దేశాలతో 10 శాతం అదనపు సుంకం విధింపును ప్రకటించారు.
ట్రంప్ నియంతృత్వ పోకడలు
అంతటితో ఆగలేదు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు, ట్రంప్ ప్రియ మిత్రుడు జైర్ బోల్సానారోపై ఆ దేశంలో అక్రమంగా క్రిమినల్ కేసు నడుపుతున్నారని, ఆ కేసు ఉపసంహరించుకోకపోతే బ్రెజిల్‌పై 50శాతం సుంకాలు విధిస్తానని ఫర్మానా జారీ చేశారు. అమెరికాతో వాణిజ్య భాగస్వాముల్లో చైనా తదుపరి స్థానం బ్రెజిల్‌ది. తాము బెదిరేది లేదని, అంతే సుంకాలు విధిస్తామని అధ్యక్షుడు డిసిల్వా ప్రకటించారు. ఒక దేశంలో ఆరోపించబడిన నేరాలపై విచారణ జరపడం ఆ దేశ సార్వభౌమాధికార హక్కు అని తెలియని అమాయకుడు కాదు కదా ట్రంప్. 2026లో అధ్యక్ష ఎన్నికలకు బోల్సానారోను మితవాదుల అభ్యర్థిగా పోటీ చేయించడం ట్రంప్ ఉద్దేశం. అతనికి శిక్ష పడితే పోటీకి అనర్హుడవుతాడు. అందుకే ఈ బెదిరింపు. అలాగే అమెరికా బ్రెజిల్ మితవాద వాచాలుల సోషల్ మీడియా అకౌంట్ల మూసివేతను ఉత్తర్వు చేసిన బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అలెగ్జాండ్రె డి మోరెస్పై ఇరు దేశాల మితవాదులు దాడి చేస్తున్నారు. బోల్సానారోపై కేసు విచారిస్తున్నదీ ఈ జడ్జినే. తమ యుద్ధోన్మాద మిత్రుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు ఉత్తర్వు చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును గుర్తించబోనని అన్న నిరంకుశుడు ట్రంప్.
ట్రంప్ నిరంకుశత్వానికి మరో తాజా ఉదాహరణ గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఉద్యోగ ధర్మంలో భాగంగా విమర్శించిన ఐరాస ప్రత్యేక వార్తహరిపై అమెరికా ఆంక్షలు విధించటం. ఈ చర్యను ‘ప్రమాదకరమైన సాంప్రదాయం’గా ఐరాస, యూఎన్ మానవ హక్కుల మండలి అధికారులు ఖండించారు. “1967 నుంచి ఆక్రమిత పాలస్తీనా భూ భాగాల్లో మానవ హక్కుల పరిస్థితిపై” ఐరాసకు నివేదించడం ఫ్రాన్సీస్కా అల్బనీస్ పని. గాజాలో ఇజ్రాయెల్ అతిక్రూరమైన మానవసామూహిక హననాన్ని, గాజా భూభాగాన్ని అది స్వాధీనం చేసుకోవడాన్ని ఆమె తరచూ తమ నివేదికల్లో విమర్శిస్తున్నారు. ఇజ్రాయెల్‌ను విమర్శించే కార్యకలాపాలను అనుమతిస్తున్నారనే సాకుతోనే అమెరికాలోని పలు విద్యాసంస్థలకు ట్రంప్ నిధులు నిలుపు చేశారు. ఇప్పుడు నెతన్యాహు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ తదుపరి ప్రతిపాదన పంపారు. ట్రంప్ ఖుషీ అయ్యారు. పాలస్తీనియన్లు గాజా విడిచి పొరుగు దేశాలకు వెళతారో, ఆ శిథిలాల్లోనే ఉంటారో నిర్ణయించుకోవాలని వారిరువురు వంత పాడుతున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ వైఖరి
ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణకు సహకరించని అధ్యక్షుడు జెలెన్స్కీపై కొద్ది నెలల క్రితం విరుచుకుపడిన ట్రంప్ తాజాగా తన ‘మిత్రుడు’ రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరిని విమర్శిస్తూ, మరికొన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తానని హెచ్చరిస్తూ, రెండోవైపున, ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా పునరుద్ధరించాడు. ఇటువంటి అధ్యక్షుని ఏలుబడిలో అమెరికా ప్రతిష్ట ఎగబాగుతుందా, దిగజారుతుందా?