prajapaksham

UK News: యూకేలో 16 సంవత్సరాలకే ఓటు హక్కుపై పెద్ద ఎత్తున చర్చ…ఎవరేం అంటున్నారు…ఇకపై మైనర్లు దేశాన్ని శాసిస్తారా..?

యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు యూకేలో ఓటు వేయాలంటే కనీస వయసు 18. అయితే, ఇప్పుడు దాన్ని 16 సంవత్సరాలకు తగ్గించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇది అమలులోకి రావాలంటే పార్లమెంట్ ఆమోదం కావాలి. ప్రస్తుతం యూకేలో లేబర్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. లేబర్ పార్టీ నేత, ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ మాట్లాడుతూ, “ఇప్పటికే 16 ఏళ్ల వాళ్లు పని చేస్తున్నారు, టాక్స్ కూడా వేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ల డబ్బు ఎలా వాడుతున్నామో తెలుసుకోవాలంటే, వాళ్లకూ ఓటు హక్కు ఉండాలి” అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. స్కాట్‌లాండ్, వేల్స్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే 16 ఏళ్లకే ఓటు హక్కు ఉంది. ఇప్పుడు యూకేలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ అదే విధానం అనుసరించాలన్న నిర్ణయమే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇవన్నీ పక్కన పెడితే… మన దేశంలో 1988 వరకు ఓటింగ్ ఏజ్ 21 సంవత్సరాలే. అయితే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించారు. ఇప్పుడు మనదేశంలో యువ జనాభా బాగా ఎక్కువగా ఉంది. అందులోనూ 18 ఏజ్ కంటే తక్కువ వయసులోనే చాలామంది పిల్లలు ఆలోచనల పరంగా బాగా మెచ్యూర్ అవుతున్నారు.

ఇప్పటికే యూకేలో 16 ఏళ్ల పిల్లలు మిలిటరీ సర్వీసుల్లోకి చేరుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. టాక్స్ కూడా వేస్తున్నారు. మరి వాళ్ల భవిష్యత్తు ఎలాంటి పాలసీలు ఉండాలి? ఏ పార్టీ వస్తే తమకు మంచిదో? అనే విషయంలో వాళ్లకు ఓటు హక్కు ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. అలాగే రీసెంట్‌గా చాలామంది చిన్న వయసులోనే గొప్ప ఆలోచనలు చేస్తున్నారు, పెద్ద టాస్కులు నిర్వర్తిస్తున్నారు. వాళ్లు ఓటింగ్ వంటి ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగం కావాల్సిందేనని చాలామంది అంటున్నారు.

అయితే మరికొందరు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా యువ మైండ్స్ త్వరగా మారిపోతుంటాయి, వాళ్ల అభిప్రాయాలు నిలకడగా ఉండవని చెబుతున్నారు. అందుకే ఓటింగ్ వయసు తగ్గించకూడదంటున్నారు. అదో ఎంగిలి వయసు. అప్పట్లో వచ్చిన ఎమోషన్ మీద ఓటు వేయవచ్చునని, దీని వల్ల కొన్ని కొత్త పార్టీలు – గ్రీన్ పార్టీ, రిఫార్మ్ యూకే లాంటి పార్టీలు – యువతను ఆకట్టుకుని ప్రయోజనం పొందవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకుముందు 16 ఏళ్లకే ఓటింగ్ రైట్స్ ఇచ్చిన దేశాలు కూడా ఉన్నాయి – ఆస్ట్రియా, బ్రెజిల్, అర్జెంటీనా, మాల్టా వంటి దేశాల్లో 16 ఏళ్లకే ఓటింగ్ హక్కు ఉంది. ఈ దేశాలు యువతే భవిష్యత్తు అన్న అభిప్రాయంతో ఓటింగ్ వయసు తగ్గించాయి. చిన్న వయసులో నుంచే ప్రజాస్వామ్య విధానాలపై అవగాహన కల్పించాలనేది వారి ఉద్దేశం.

అయితే యూకేలో ఓటింగ్ తప్పనిసరి కాదు. ఎలక్షన్లకు వచ్చి ఓటు వేయడం అక్కడ కొన్ని సందర్భాల్లో తగ్గిపోయింది. ఉదాహరణకు, 2014లో ఓటింగ్ టర్నౌట్ కేవలం 59.7% మాత్రమే. ప్రజలు ఓటింగ్‌కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నమాట. అలాంటప్పుడు యువతను ఓటింగ్‌లోకి తీసుకురావాలంటే ముందు వాళ్లకు ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

ఇంకా ఒక విషయముంది – యూకేలో 16 ఏళ్ల వాళ్లు తాగుడుకి, ధూమపానం చేయడానికి, లాటరీలు కొనడానికి అనుమతి లేదు. అలాంటప్పుడు ఓటింగ్ రైట్స్ ఎలా ఇస్తారు అని కన్సర్వేటివ్ పార్టీ ప్రశ్నిస్తోంది.

ఇక చూడాలి – యూకే పార్లమెంట్ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందో. కానీ యూకే తీసుకునే ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. మన దేశంలోనూ భవిష్యత్‌లో ఇలా ఓటింగ్ వయసు తగ్గించాలా? అనే అంశంపై చర్చ తప్పదు అన్నమాట.

Recent Post

Andhra Pradesh National