prajapaksham

మన్యం వీరుని త్యాగం – ప్రాతః స్మరణీయం

ఒక్కరి వల్ల ఏం సాధ్యపడుతుందనే దురభిప్రాయం నేటికీ చాలా మందిలో ఉంది. కానీ ఒక్కరి వలనే చరిత్ర మలుపు తిరిగిన విషయం మరువలేం. యుద్ధాలు జరిగినా, విప్లవాలు జరిగినా, సంస్కరణలు జరిగినా ఒక్కరితోనే ప్రారంభమై, ముగిసిన సంఘటనలెన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రసంగం ప్రపంచాన్నే ఉర్రూతలూగించింది. ఒక వ్యక్తి రచనలు, ప్రసంగాలు జాతి వివక్షతను అంతం చేసాయి. ఒక వ్యక్తి జాత్యహంకారం ప్రపంచ యుద్ధానికే పురిగొల్పింది. విధ్వంసం సృష్టించింది. ఒక నాయకుడి ఆజ్ఞతో జన ప్రభంజనమై పరుగులుతీసి, కదనరంగంలో కుతూహలం చూపించి, దేశానికి ప్రయోజనం చేకూర్చిన సంగతిని మరువలేం. దాన్ని వర్ణించలేం.

సుభాష్‌ చంద్రబోస్‌ లాంటి వీరుల పోరాట పటిమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నచ్చని నాయకులతో, నచ్చని సిద్ధాంతాలతో విబేధించి, ఆజాద్‌ హింద్ ఫౌజ్ ద్వారా ఆంగ్లేయులకు చుక్కలు చూపించిన నేతాజీ స్వాతంత్య్ర సమరాగ్ని జ్వాలలను రగిలించి, అలుపెరుగని పోరాటం చేసి మరణమెరుగని మహా వీరుడిగా చరిత్ర పుటల్లో నేటికీ సజీవంగా మిగిలే ఉన్నాడు. అలాంటి వీరుల కోవకు చెందిన మరో మహనీయుడు, తెలుగు గడ్డపై పురుడు పోసుకుని, రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్య సింహాసనాన్ని గడగడ లాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర సంగ్రామం అనేది ఉద్యమాల సమాహారం. మహోన్నత దేశ భక్తుల త్యాగఫలం వలన భారతదేశం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను శ్వాసించగలిగింది. విభిన్నమైన సిద్ధాంతాలు, వైరుధ్యాలు గల నాయకులెంతో మంది తమ దారులు వేరైనా ఒకే లక్ష్యసాధన కోసం శ్రమించారు. గమ్యం ఒకటే అదే భారత స్వాతంత్య్ర సాధన.

స్వాతంత్య్రోద్యమం కురుక్షేత్ర రణరంగాన్ని తలపించింది. ఒక రకంగా చెప్పాలంటే నాటి కౌరవ పాండవ కురుక్షేత్ర సమరంతో భారత స్వాతంత్య్రాన్ని పోల్చవచ్చు. మదపుటేనుగులా చెలరేగే ఆంగ్ల పాలకులు ఒకవైపు, ధర్మం, న్యాయం, ధైర్యం, ఆత్మాభిమానంతో భారతీయులు మరొకవైపు… రెండు పక్షాల మధ్య సమాన స్థాయిలో పోరాటం సాగే పరిస్థితులు లేవు. అయినప్పటికీ ధర్మమే జయిస్తుందనే భారతీయుల విశ్వాసం గెలిచింది. వీరుల త్యాగాలు ఫలించాయి. శతాబ్దాల భారతీయుల స్వప్నం నెరవేరింది. తెల్లదొరల కర్కశ పాదాల క్రింద నలిగి పోయిన భరతజాతి ఎట్టకేలకు విముక్తి పొందింది. స్వేచ్ఛావాయువులు ప్రసరించాయి. భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో సుభాష్‌ చంద్రబోస్‌ ఎంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించాడో, తెలుగు నేలపై అదే రీతిలో కదం తొక్కి, తెల్ల దొరలకు ముచ్చెమటలు పట్టించాడు మన తెలుగు మహాయోధుడు, వీరుడు అల్లూరి సీతారామరాజు.

ఆయన గురించి చరిత్ర పెద్దగా దృష్టి సారించక పోవడం, జాతీయ స్థాయిలో అల్లూరి సీతారామరాజు త్యాగానికి సరైన ప్రాధాన్యత లభించక పోవడం బాధాకరం. విల్లంబులతో విజృంభించి, ఆంగ్ల మత్తేభాల మదమణిచిన ఆ మహనీయుని స్మరణ తెలుగునాట మాత్రమే కాదు, దేశమంతా మార్మోగాలి. అల్లూరి స్ఫూర్తి మరణించకూడదు. అజరామరమై వెలుగొందాలి. బ్రిటీషు వారి తుపాకీ గుళ్ళకు తన గుండెనే ఎదురు చూపిన ధీశాలి, వీరుడు, తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మన్యం ప్రజలకు ఆప్తమిత్రుడు, అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన మహాయోధుడు ‘అల్లూరి’. తుపాకులతో భారతీయుల హృదయాలకు తూట్లు పొడుస్తున్న తెల్లతోలు బ్రిటీషు సామ్రాజ్యవాదులను విల్లంబులతో పోరాడి గెలవలేమని భావించిన రామరాజు ‘వజ్రం వజ్రేన భిద్యతే’ అన్న చందంగా ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని అన్వయించాడు.

పోలీసు ఠాణాలపై ఆకస్మికంగా విరుచుకుపడి ఆయుధ సామాగ్రిని వశపరచుకొని వాటితోనే తెల్ల దొరల దురహంకార మదాన్ని అణచిన అత్యంత సాహసి, మకుటం లేని మహారాజు మన సీతారామరాజు. రంప ఉద్యమం రాజు జీవితచరిత్రలో మరపురాని మహా అధ్యాయం. సారూప్యత గల విప్లవకారులతో సమాలోచనలు జరిపి, భావాలతోనే దేశభక్తిని రగిలించగలమని, ప్రవచనాలతో స్వాతంత్య్రం సిద్ధించదని పథక రచన చేసి, వ్యూహాత్మకంగానే బ్రిటీషు పరాన్నభుక్కులకు పట్టపగలే చుక్కలు చూపించిన సాహసి అల్లూరి. బ్రిటీషు వారి దాస్యశృంఖలాల్లో మ్రగ్గి పోతున్న భరతజాతికి స్వేచ్ఛావాయువులందించడానికి, సర్వం త్యజించి తన ప్రాణాలనే పణంగా పెట్టి పోరుబాటలోనే పయనించి విప్లవ జ్యోతులను వెలిగించి, కఠిన, కర్కశ, పాషాణ సదృశమైన తెల్లదొరల తుపాకీ గుళ్ళకు బలైన చైతన్య కెరటం అల్లూరి. తన బలిదానం తర్వాత కూడా స్వాతంత్య్ర పిపాస భారతీయుల హృదయాల్లో రగిలించిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు.

గంటం దొర, మల్లు దొర లాంటి నమ్మిన బంట్లు రామరాజు ఉద్యమానికి ఊతంగా నిలిచారు. నమ్మిన వారే మోసం చేస్తున్న నేటి కాలంలో ఆ ఇరువురి చరిత్ర ఆదర్శప్రాయం. రూథర్‌ఫర్డ్‌ కుటిల రణనీతి అల్లూరి ఊపిరిని తీసివేసినప్పటికీ, అల్లూరి తెగువ మరెంతోమంది విప్లవకారులకు ఊపిరి పోసింది. యువతులను పీడించి, అత్యాచారాలకు తెగబడి, గిరిజనుల బ్రతుకుల్లో చిచ్చు పెట్టిన ఆంగ్లేయులకు అల్లూరి కంటకప్రాయంగా మారాడు. కొండకోనల్లో ప్రకృతి ఒడిలో భద్రంగా జీవించే అమాయక ప్రజల భద్రతనే ప్రశ్నార్ధకంగా మార్చిన దురహంకారుల పాలిట సింహస్వప్నంలా మారాడు రామరాజు. అల్లూరిని మట్టుపెట్టాలనే ఏకైక ధ్యేయంతో తెల్లదొరలు సమయం కోసం వేచి చూసారు. తెల్లదొరలకు దాష్ఠీకం చేస్తున్న వారే అల్లూరి ఆచూకీ గురించి ఉప్పందించి భరతజాతికి ద్రోహం చేసారు. ఇలాంటి ద్రోహచింతన వలన భారతీయులకు స్వాతంత్య్రం సిద్ధించడంలో ఆలస్యం జరిగింది.

హిట్లర్‌ లాంటి నియంత సైతం మన వీరులకు సాయం చేయడానికి ముందుకు వస్తే, మన వారే మన వీరులకు ద్రోహం చేసి, బ్రిటీషువారికి పాదాక్రాంతమై భారతీయుల ఉద్యమ స్ఫూర్తికి తీరని ద్రోహం చేసారు. సుభాష్‌ చంద్రబోస్‌ వంటి మహావీరుల సరసన స్థానం సంపాదించవలసిన అల్లూరి సీతారామరాజుకు జాతీయ స్థాయిలో సరైన గుర్తింపు లభించకపోవడం అత్యంత దురదృష్టకరం. మొక్కుబడి ప్రసంగాలతో అల్లూరి ఖ్యాతిని మరుగున పడేయడం చరిత్రకే కళంకం. ఇకనైనా భారత ప్రభుత్వం అల్లూరి త్యాగనిరతిని గుర్తించి ఆ మహా స్వాతంత్య్ర సమరయోధుని ఇతర దేశభక్తుల సరసన సగర్వంగా నిలబెట్టాలి. ‘భారతరత్న‘తో ఆ తెలుగు మహనీయుని చైతన్య స్ఫూర్తికి తగిన గుర్తింపు నివ్వాలి. అల్లూరి స్ఫూర్తి అజరామరం – అల్లూరి ఖ్యాతి ఆచంద్రతారార్కం. అల్లూరి పోరాటం భావితరాలకు మార్గనిర్దేశనం.

  • సుంకవల్లి సత్తిరాజు

Recent Post

Andhra Pradesh National