అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్రం .. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలు కూడా హైదరాబాద్ స్థాయికి రావడం లేదని అన్నారు.మహేశ్వరం మండలంలోని పారిశ్రామిక జనరల్ పార్క్‌లో 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మలబార్ బంగారు, వజ్రాభరణాల తయారీ యూనిట్‌ను గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘తెలంగాణ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యం. ఇక్కడ పెట్టుబడులు పెట్టినవారికి సంపూర్ణ భద్రత, మంచి లాభాలు లభిస్తాయి’’ అని పేర్కొన్నారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహేశ్వరం, ముచ్చర్ల, బేగరి కంచె ప్రాంతాల్లో 30 వేల ఎకరాల్లో “భారత్ ఫ్యూచర్ సిటీ”గా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. ‘‘పెట్టుబడిదారులు లాభాలు పొందేలా పూర్తి సహకారం అందిస్తాం. ప్రభుత్వ విధానాలు పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉంటాయి’’ అని హామీ ఇచ్చారు.బంగారు, వజ్రాభరణాల కొనుగోళ్లలో తెలుగు రాష్ట్రాల మహిళలే అగ్రభాగాన ఉన్నారని సీఎం పేర్కొన్నారు. మహేశ్వరం బంగారు ఆభరణాల తయారీకి అత్యుత్తమ స్థలంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ఐటీ, ఫార్మా రంగాల మాదిరిగా తయారీ రంగానికీ తెలంగాణను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 2022–23లో తయారీ రంగ జీవీఏ ₹1.34 లక్షల కోట్లు ఉండగా, 2023–24లో అది ₹1.46 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. జీఎస్డీపీలో తయారీ రంగ వాటా రాష్ట్రంలో 19.5% ఉండగా, జాతీయ స్థాయిలో అది 17.7% మాత్రమేనని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.