రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే రాజ్యాంగ ప్రవేశిక నుండి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలని ప్రతిపాదించారు. ప్రవేశిక ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగం మౌలిక స్వరూపంలో భాగంగా ఉంది. ప్రవేశికలోని అన్ని పదాలను లేదా భావనలను సుప్రీంకోర్టు చాలాసార్లు సమర్థించింది. రాజ్యాంగ ప్రవేశిక నుండి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించడం రాజ్యాంగంపై దాడికి పాల్పడినట్లే అవుతుంది. ఇది రాజ్యాంగాన్ని ధ్వంసం చేయటం, భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే ఆర్ఎస్ఎస్ దీర్ఘకాలిక లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, కలలకు భారత రాజ్యాంగం సజీవ నిదర్శనం. ప్రవేశికలో సోషలిజం, సెక్యులరిజం పదాలను చేర్చడం యాదృచ్ఛికం కాదు; ఇది స్వాతంత్ర్య సమరయోధులు నిలబడిన, తమ ప్రాణాలను అర్పించిన మూల విలువలను ప్రతిబింబిస్తుంది. వారి ఆదర్శాలు రాజ్యాంగంలోని ప్రతి నిబంధనలో పొందుపరచబడ్డాయి. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ పదాలను చేర్చడం కేవలం ఆ వారసత్వాన్ని ధృవీకరించింది. ప్రవేశిక రాజ్యాంగం ప్రధాన విలువలను కలిగి ఉంది. ప్రవేశికను మార్చడానికి ఏ ప్రయత్నమైనా రాజ్యాంగ విద్రోహ చర్య అవుతుంది.
సెక్యులర్ అనే పదం అంబేద్కర్ రాజ్యాంగంలో లేదనే హోసబాలే వాదన కూడా అబద్ధం. ప్రవేశికలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చడానికి ముందే, రాజ్యాంగంలోని పార్ట్ 3లో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల విభాగంలో ఈ పదం ఉంది. సెక్యులర్ అనే పదం ఆర్టికల్ 25లోని క్లాజ్ (2)(ఎ) కింద ఉంది. ధర్మాధర్మ వివేక స్వేచ్ఛ, మతావలంబన, మతాచరణ, ప్రచార స్వేచ్ఛలను అది ప్రస్తావించింది. కాబట్టి ఈ పదం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడానికి ముందే ప్రధాన విలువల్లో ఒకటిగా ఉంది. నిజానికి, ఆర్ఎస్ఎస్కు ప్రవేశికతో మాత్రమే కాదు, మొత్తం రాజ్యాంగంతోనే అసౌకర్యంగా ఉంది. మన స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతల ఆదరణ పొందిన విలువలను ఇది సహించదు. దీనికి కారణం చాలా సులభం – స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ ఎటువంటి పాత్ర పోషించలేదు. అది కేవలం బ్రిటీష్ వారితో సహకరించింది. మతం ఆధారంగా భారతీయుల మధ్య విభేదాలను సృష్టించడం ద్వారా జాతీయ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నించింది. ఆ విధంగా, ఆర్ఎస్ఎస్ వలస పాలకుల విభజించు విధానానికి సహాయపడింది.
రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ఉద్దేశాన్ని ఆర్ఎస్ఎస్ వ్యక్తపరచడం ఇదే మొదటిసారి కాదు. అది ఎప్పటికప్పుడు తన మాటలు, చేతల ద్వారా ఇలా చేస్తూనే ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, అనేక మంది బిజెపి నాయకులు తమ పార్టీ 400కి పైగా సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఈ వాదనలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. విస్తృత చర్చకు దారితీశాయి. వాస్తవానికి ఈ ఆందోళన చాలా పెద్ద చర్చకు దారి తీసింది. అమిత్ షా తన ఎన్నికల ప్రచార ప్రసంగాలలో ప్రవేశికలోని సెక్యులర్ పదంపై తన ప్రేమను బహిరంగంగా ప్రదర్శించవలసి వచ్చింది. తమ పార్టీ 400కి పైగా సీట్లు పొందితే ఈ పదం రాజ్యాంగం నుండి తొలగించబడుతుందనే బిజెపి నాయకుల వాదనలను ఖండించవలసి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి బలం 303 నుండి 240కి తగ్గిన విషయం తెలిసిందే కదా! ప్రధాన కార్యదర్శి భారత రాజ్యాంగ ప్రవేశిక నుండి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను తొలగించాలని ప్రతిపాదించిన వెంటనే, ఎప్పటిలాగే, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, జితేంద్ర సింగ్, అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మతో సహా పలువురు బిజెపి నాయకులు తమ గొంతు కలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అయితే ప్రవేశికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను చేర్చడం సనాతన స్ఫూర్తికి అపవిత్రం అని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి సమష్టి చర్యకు పదే పదే పాల్పడడం ద్వారా బిజెపి, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని దెబ్బతీయాలనే వారి ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
వాస్తవానికి రాజ్యాంగ పరిషత్ మొత్తం భారతదేశ రాజ్యాన్ని సెక్యులరిజం కింద తీసుకువచ్చేందుకు కృషి చేసింది. 1949 అక్టోబర్ 14న రాజ్యాంగ పరిషత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా ప్రకటించారు: ఈ స్వేచ్ఛా భారతదేశ, లౌకిక రాజ్య, రాజ్యాంగాన్ని మున్ముందు మతపరమైన ప్రాతిపదికన ఏ నిబంధనతోనూ రూపుమార్చే అవకాశం ఉండబోదని నేను స్పష్టం చేస్తున్నాను. 1949 నవంబర్ 23న లౌకిక రాజ్యం ప్రాముఖ్యతను రాజ్యాంగ పరిషత్‌కు చెందిన మరో సభ్యుడు టి.జె.ఎం. విల్సన్ ఇలా వివరించారు: మన రాజ్యాంగం గొప్ప విజయం దాని లౌకిక స్వభావం, దాని నుండి ఉద్భవించిన లౌకిక రాజ్యం. మనం దేశానికి ఈ లౌకిక స్వభావాన్ని సాధించాము. దానిని రాజ్యాంగంలో అందించాము. అని పేర్కొన్నారు. కానీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రాజ్యం లౌకిక స్వభావంపైకి బెదిరిస్తున్నాయి. ఈ దేశంలోని ప్రగతిశీల శక్తులు, మన గొప్ప, ప్రియమైన ప్రధాన మంత్రి (జవహర్లాల్ నెహ్రూ) మార్గదర్శకత్వంలో, నాయకత్వంలో, ఆ మేఘాలను తొలగించి, లౌకిక రాజ్యాన్ని సాధించడానికి యూరోప్, ఆసియాలోని చాలా దేశాలు అనుభవించిన ఆ వినాశనం, దురదృష్టాన్ని మన దేశం మళ్ళీ అనుభవించడానికి అనుమతించబోరని నేను ప్రార్థిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. అని అన్నారు.
సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగ ప్రవేశికలో సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను చేర్చడాన్ని సమర్థించింది. 2024 నవంబర్‌లో రాజ్యాంగం 75వ వార్షికోత్సవానికి ముందు, ప్రవేశికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను చేర్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను కొట్టివేసింది. రాజ్యాంగం ఆమోదించే సమయంలో దాని ఆదిరూపంలో ప్రవేశికలో ఈ పదాలు లేవనే కారణంతో మాత్రమే ఈ పదాలను చేర్చడాన్ని చెల్లుబాటు కాకుండా చేయలేమని తీర్పు చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పి.వి. సంజయ్ కుమార్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.