నిస్సార భూమికి తిరిగి జీవం పోసే శక్తి మనకు ఉంది. నేలలను పునరుద్ధరిస్తే పలు నూతన అవకాశాలు సృష్టించబడతాయి. నేడు అలాంటి అవకాశాలకు ద్వారాలు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరోగ్యకర పర్యావరణం మీదే 50 శాతం ప్రపంచ జీడీపీ ఆధారపడి ఉంది. నేడు ప్రతి ఏటా ఈజిప్ట్ దేశమంత భూభాగం క్షీణించిపోతున్నది. దీని వల్ల జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లడం, కరువులు పెరగడం, ధరలు పెరగడం, అస్థిరత రాజ్యమేలడం, పౌర సమాజం వలసల స్థానభ్రంశం చెందడం జరుగుతుంది.
భూమిని పునరుద్ధరిస్తే ఉత్పాదకత పెరగడం, ఆహార భద్రత సాధించడం, నీటి చక్రాలు బలపడడం, గ్రామీణులకు జీవనోపాధులు పెరగడం జరుగుతుంది. భూ క్షీణత, కరువులు అనేవి అవిభాజ్యమైన అనర్థాలు. వీటి వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది, ఆహార ఉత్పత్తులు తగ్గుతాయి, జీవన నాణ్యతకు కోతపడుతుంది, నీటి లభ్యతకు గండి పడుతుంది. నేల క్షీణత, ఎడారీకరణ అనర్థాలను అడ్డుకోవడం, పునరుద్ధరించడం లాంటి అంశాలను క్రమం తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రకృతికి పునాది సారవంతమైన నేల. ఇలాంటి ఆరోగ్యకర భూములను మానవ, ప్రకృతి ప్రమేయాలతో నిస్సారం, నిర్వీర్యం చేయడం జరుగుతోంది. ఇలాంటి నేల క్షీణత మరికొంత కాలం కొనసాగితే శాశ్వతంగా పనికి రాని ఎడారులుగా మారిపోతాయని గమనించాలి.
నేల ఎడారీకరణను అడ్డుకోని యెడల రాబోయే 25 ఏళ్ళలో 12 శాతం ఆహార ఉత్పత్తులు పడిపోయి 30 శాతం వరకు సరుకుల ధరలు పెరుగుతాయి. ఆహార అభద్రత ఉచ్చులో చిక్కుకున్న భారతంలో వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచడానికి 1960ల్లో నార్మన్ బోర్లాంగ్ నాయకత్వంలో హరిత విప్లవం వచ్చింది. సాగు దిగుబడులు పెరగడం, ఆహార భద్రత సాధించడం జరిగినప్పటికీ ఒకే రకమైన వరి, గోధుమ పంటలను దశాబ్దాలుగా పండించడం కారణంగా సారవంతమైన నేలల నాణ్యత క్షీణించడం, ఎడారీకరణ అంచున నిలబడడం జరిగింది. ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, యూపీ, బీహార్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో దాదాపు 5 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ నేలలు ఎడారీకరణ అంచున చేరాయి.
అవగాహన లేమి, అశాస్త్రీయ సాగు పద్ధతులతో సారవంతమైన నేలలు నిస్సారమై ఎడారి భూములుగా మారడాన్ని నేల ఎడారీకరణ అంటారు. ఎడారీకరణతో కరువుకు విడదీయరాని సంబంధం ఉంటుంది. అడవుల నరికివేత, పశుగ్రాసం అధిక వినియోగం, పోడు వ్యవసాయం, రోడ్ల నిర్మాణం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, ఒకే రకమైన పంటల్ని ఏళ్ళ తరబడి వేయడం లాంటివి కూడా నేల ఎడారీకరణను వేగవంతం చేస్తాయి. కాగా, నేల ఎడారీకరణ సంక్షోభంతో 3 బిలియన్ల మానవాళి పేదరికంలోకి నెట్టబడి, ఒక బిలియన్ ప్రజలు ఆకలి చావుల అంచున నిలబడడం జరుగుతున్నది.
వ్యవసాయ నేలలకు సారం అందించని యెడల క్రమంగా శుష్క భూములుగా మారుతూ దిగుబడులు తగ్గుతూ, సాగు చేసుకోలేని ఎడారులుగా మారతాయి. అతిగా కృత్రిమ ఎరువులు వాడడం, విచక్షణారహితంగా రసాయనాలు వాడడం, అధిక నీటిని వినియోగించడం, అతిగా పురుగు మందులు వాడడం, అశాస్త్రీయ సాగు పద్ధతులు లాంటి అంశాల వల్ల తాత్కాలికంగా దిగుబడులు పెరిగినా, క్రమంగా నేలలు నిస్సారమై ఎడారులను తలపిస్తాయి. మానవ కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డలను అందించడానికి సారవంతమైన నేలలు ప్రధాన భూమికను నిర్వహిస్తాయి. నేల సారాన్ని కాపాడుకుంటూ, నాణ్యమైన మట్టి వాసనను ఆస్వాదిస్తూ, మట్టి మర్యాదను గౌరవిస్తూ, మట్టిలోంచి మాణిక్యాలను పండిద్దాం.