prajapaksham

నీటిపై నోరు పెద్దది చేసుకుంటే వాస్తవాలు మారవు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూన్ 30న మూడు వార్తలు అందాయి. అందులో ఒకటి దుర్వార్త. రెండు శుభవార్తలు. మైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి 40 మంది పైగా కార్మికులు దుర్మరణం పాలు కావడం దుర్వార్త. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నారపరాజు రామచంద్రరావు నియామకం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం శుభవార్తలు. సంజయ్ లేదా ఈటల రాజేందర్లలో ఎవరైనా బీజేపీ సారథి అయితే పోటీ వేరే రకంగా ఉండేదని రేవంత్ అంచనా. రామచంద్రరావు విషయంలో బీజేపీ శ్రేణుల్లోనే అసంతృప్తి అలుముకున్నందున సీఎం ఇక బీజేపీని సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. వివాదానికి పర్యావరణ అనుమతి తిరస్కరణ రేవంత్ రెడ్డికి ఉపశమనం కలిగిస్తుంది. ఆ ప్రాజెక్టు రద్దు కోసం తమ పోరాటం కొనసాగుతుందని జూలై 1న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

గత ప్రభుత్వంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు గుదిబండగా మారాయి. 2015 జూన్ 15న జరిగిన సమావేశంలో నీటి కేటాయింపులపై కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టి తెలంగాణ ప్రాంతానికి మరణశాసనం వంటి నిర్మాణాలను ఆనాటి ప్రభుత్వం పూర్తి చేయలేదు. తెలంగాణకు 299 టీఎంసీలను వాడుకోలేకపోయాం. రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే ఆ నీటిని తెలంగాణ వాడుకోలేకపోయింది. కృష్ణా బేసిన్లో 1486 టీఎంసీలు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రాకు కేటాయించారు. ప్రాణహిత వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ ధన దాహంతో రీఇంజనీరింగ్ పేరుతో ఊరు పేరు అంచనాలు మార్చారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుతో 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నా, బనకచర్లను ఒక భూతంగా చిత్రీకరించాలని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. 3 వేల టీఎంసీలు వరద జలాలు సముద్రంలో కలుస్తున్నట్టు కేసీఆర్ ప్రకటనలు చేశారు. చంద్రబాబు అనువుగా తీసుకున్నారు. ఈ రాచపుండు సృష్టించిందే కేసీఆర్. ఇదే ప్రజాభవన్లో జగన్‌కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి కేసీఆర్ గోదావరి జలాలు తీసుకుపొమ్మన్నారు. గోదావరి బేసిన్లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే మిగులు జలాల లెక్క తేలుతుంది. జలాల లెక్క తేలాలంటే ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నాకు రాయలసీమ రొయ్యల పులుసుతో పనిలేదు. తెలంగాణ ప్రజల హక్కులతోనే పని. కృష్ణా బేసిన్లో మేం కట్టుకునే ప్రాజెక్టులకు ఏపీ అభ్యంతరాలు చెబుతోంది. నికర జలాల కేటాయింపు ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఎందుకు? చర్చలతోనే పరిష్కారమవుతుంది. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం లిటిగేషన్లు పెడుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు బాధ్యత తీసుకోరు? ఈ వివాదాన్ని పెంచి బీఆర్ఎస్ పార్టీని బతికించుకుని రాజకీయ లబ్ది పొందాలనుకుంటోంది. వాళ్ల ఆరాటం నీటి కేటాయింపుల కోసం కాదు. ఇదొక రాజకీయ వ్యూహం. అంతరించిపోతున్న బీఆర్ఎస్‌ను పునరుజ్జీవింపజేసేందుకు వీళ్ల ఆరాటం. రెండు రోజులు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడదాం. ఒక రోజు కృష్ణా బేసిన్ పై, ఇంకో రోజు గోదావరి బేసిన్ పై చర్చ పెడదాం. ఈ రాచపుండును తెలంగాణ ప్రజలకు అంటగట్టింది ఎవరో తేలవలసిన అవసరం ఉంది. బీఆర్ఎస్‌ను బతికించేందుకు ప్రయత్నం చేస్తోంది. కిషన్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది అని సీఎం జూలై 1న ఆరోపించారు. రేవంత్ రెడ్డి గడచిన 18 నెలల్లో పరిపాలనపై పట్టు సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనుభవం ఉన్న నాయకుడిగా ప్రవర్తిస్తున్నారు. నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందర్నీ ఒక మాట మీద నిలబెట్టి నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే సొంత కాంగ్రెస్ పెద్దలతోనూ సఖ్యతగా మసలుకోవడం కత్తిమీద సాము వంటిది. ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా పరిపాలన సక్రమంగా నడిపిస్తున్నట్టు కనపడుతోంది. అవినీతిపరులైన అధికారులను సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటున్నారు.

పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి టచ్‌లో ఉన్నట్టు గాంధీభవన్ వర్గాలంటున్నాయి. రేవంత్ రెడ్డికి మద్దతుగా పార్టీ వైపు నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు బీఆర్ఎస్‌ను చెండాడే పనిలో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క వంటి కొందరు మంత్రులు సైతం సీఎంపై ప్రతిపక్షాలు దాడి చేసిన వెంటనే ప్రోయాక్టివ్‌గా ఎదురుదాడి చేస్తున్నారు. అయితే ఈ సన్నివేశాలను డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం ఉన్నప్పటి సన్నివేశాలతో పోల్చలేం. అప్పట్లో వైఎస్.పై ఈగ వాలితే మంత్రుల బృందం ప్రత్యర్థులపై అమాంతం విరుచుకుపడేది.

రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన రోజునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అని ప్రచారం జరిగింది. కామారెడ్డిలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డిని పోటీకి నిలబెట్టడం ద్వారా కూడా ఏఐసీసీ అలాంటి సంకేతాలు పంపింది. మాజీ మంత్రులు, సీనియర్లను కాదని రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినప్పుడు సహజంగానే పార్టీలో వ్యతిరేక స్వరాలూ వినిపించాయి. ఎన్నో అవాంతరాల మధ్య ప్రతిరోజు ఒక గండం ఆయనకు ఎదురైంది. రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపించడం ఒక ఎత్తు అయితే పార్టీలోనే సీనియర్ నాయకులను సంతృప్తి పరచడం మరొక ఎత్తు. నోటు కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైలు నుంచి నెలరోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడే కేసీఆర్‌ను ఓడించడమే నా లక్ష్యం అని రేవంత్ ప్రకటించారు. ఓడిపోయిన తర్వాత 4 నెలలకు పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. అప్పటినుంచి రేవంత్ రెడ్డి పేరు ప్రజల్లో మారుమోగుతూ వచ్చింది. రేవంత్ రెడ్డి బీజేపీ మీద కాకుండా బీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టారు. ప్రధానంగా గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పట్ల, రేవంత్ పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. కాగా ఇప్పుడు కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు రేవంత్ రెడ్డి మార్పుపై ఊహాగానాలు చేస్తున్నాయి. పొరబాటు చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా లేదు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం మంచి శకునమే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులంతా అవినీతిలో కూరుకుపోయినట్టు ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల ఇప్పుడప్పుడే బీఆర్ఎస్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. రేవంత్ రెడ్డిని హేళన చేయడమో, అవమానించడమో పనిగా పెట్టుకున్న బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికీ తన తప్పులను సరిదిద్దుకొని ప్రజల ముందుకు వెళ్లే ఆలోచనలో లేదు.

Recent Post

Andhra Pradesh National