prajapaksham

ఉద్యోగాలకు కొత్త దారి: ఉద్యోగ అనుబంధ ప్రోత్సాహక పథకం

ఆర్థిక ప్రయాణం వేగంగా విస్తరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరుగుతున్నది. ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నవి నిశ్చయమే. కానీ ఈ అభివృద్ధి కథనాన్ని నిలబెట్టే ఒక ప్రధాన ప్రశ్న ఇంకా ఎదురుగానే ఉంది. దేశంలో ఉద్యోగాలు ఎక్కడ? మరియు అవి ఎంత స్థిరమైనవి? కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ఉద్యోగ అనుబంధ ప్రోత్సాహక పథకం ఈ ప్రశ్నకు సమాధానంగా కొత్త మార్గాన్ని సూచిస్తుంది. 2025 జూలై 1న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం, 2025 ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ పథకం ప్రధానంగా రెండు సంవత్సరాల్లోగా 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మొత్తం ఖర్చు రూ.99,446 కోట్లు. గతంలో ఉన్న ఉపాధి పథకాల వలె కేవలం జీతాల సహాయానికి మాత్రమే కాకుండా, దీని గమ్యం దీర్ఘకాలిక ఉపాధిని కల్పించడం, ఉద్యోగాల అధికారికరణను ప్రోత్సహించడం, ఉద్యోగులతో పాటు సంస్థలకూ ప్రత్యక్ష ప్రయోజనాలు కల్పించడం. ఉద్యోగాల కల్పన మాత్రమే కాదు, ఈపీఎఫ్‌ఓ (EPFO) సంస్థలతో అనుసంధానించడంవల్ల ఈ ఉద్యోగాలకు సామాజిక భద్రతా పదును కూడా ఏర్పడుతుంది.

పథకం నిర్మాణం: రెండు భాగాలు
ఈ పథకం రెండు భాగాలుగా నిర్మితమైంది:

మొదటి భాగం (పార్ట్ ఎ): యువతకు ప్రత్యక్ష ప్రయోజనాలు
ఇది ఉద్యోగాన్ని సంపాదించే యువతకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తుంది. నెలకు ఒక లక్ష రూపాయల లోపు జీతం పొందే వారు అర్హులు. ఆరు నెలల నిరంతర సేవ చేసిన తర్వాత ఒక నెల ఈపీఎఫ్‌ జీతానికి సమానంగా (గరిష్టంగా రూ. 15,000) ప్రోత్సాహకంగా డబ్బు వారి ఖాతాలోకి వస్తుంది. ఏడాది పూర్తి చేసాక మరో విడత డబ్బు అందుతుంది. అయితే అది ఆర్థిక విజ్ఞాన శిక్షణ పూర్తి చేసిన తరువాత మాత్రమే. ప్రోత్సాహకం నేరుగా వ్యక్తుల పాన్ ఆధారిత ఖాతాలోకి డీబీటీ (DBT) ద్వారా జమ అవుతుంది. ఈ విధంగా, పొదుపు అలవాటు, ఆర్థిక స్థిరత్వం రెండింటినీ పెంపొందించే యత్నం ఇది.

రెండవ భాగం (పార్ట్ బి): సంస్థలకు ప్రోత్సాహక భత్యం
ఈ భాగం ద్వారా సంస్థలకు ప్రోత్సాహక భత్యం అందుతుంది. 50 మందికి లోపు సిబ్బంది ఉన్న సంస్థలు కనీసం ఇద్దరిని, 50 మందికి మించిన సంస్థలు కనీసం ఐదుగురిని కొత్తగా నియమించాలి. ఈ నియామకాలు స్థిరంగా కనీసం ఆరు నెలలపాటు కొనసాగాలి. వారి జీత స్థాయిని బట్టి నెలకు సంస్థలు ఈ క్రింద పేర్కొన్న విధంగా ప్రోత్సాహాన్ని పొందగలవు:
జీతం రూ.10,000 లోపు అయితే రూ.1,000;
జీతం రూ.10,000 నుంచి 20,000 మధ్య అయితే రూ.2,000;
జీతం రూ.20,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు అయితే రూ.3,000.
ఈ సహాయం సాధారణంగా రెండు సంవత్సరాలపాటు అందుతుంది. కానీ తయారీ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యంతో ఇది మూడవ, నాలుగవ సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది.

తయారీ రంగానికి ప్రత్యేక దృష్టి, ఆశించిన ప్రయోజనాలు

తయారీ రంగానికి ఈ ప్రత్యేక దృష్టి అనేది ఊహాజనిత నిర్ణయం కాదు. ఇది భారతదేశ ఆర్థిక స్వావలంబనకు కీలకంగా భావించే రంగం. దీని ద్వారా స్థిర ఉద్యోగాలు, నైపుణ్యాల పెరుగుదల, ఉత్పాదకత మెరుగవుతాయి. అందుకే నాలుగు సంవత్సరాల ప్రోత్సాహం ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు సరైన విధానం. ఈ పథకం ద్వారా తయారీ రంగం ద్వారా సుమారు 2.6 కోట్ల ఉద్యోగాలు, అలాగే 1.92 కోట్ల మొట్టమొదటి ఉద్యోగులకూ ప్రత్యక్ష ప్రయోజనం అందే అవకాశం ఉంది. మొత్తం 3.5 కోట్ల ఉద్యోగాల లక్ష్యం అందుబాటులో ఉందనిపించడంలో ఆశాభావం ఉంది.

ఇప్పటి వరకు అమలైన పథకాలతో పోలిస్తే, ఈ పథకం వినూత్నమైనది. ఉదాహరణకు, కరోనా సమయంలో అమలులో ఉన్న ‘ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన’ తాత్కాలిక సహాయం మాత్రమే. ఈ పథకం మాత్రం సంక్షేమాన్ని దాటి దీర్ఘకాలిక భద్రతను లక్ష్యంగా పెట్టుకున్నది. ఆర్థిక విజ్ఞానం, డీబీటీ ఆధారిత పారదర్శక వ్యవస్థ, తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి వంటి అంశాలు దీన్ని కొత్త తరహాలో నిలబెడుతున్నాయి.

అమలులో సవాళ్లు, భవిష్యత్ ఆశలు
అయితే, ఈ పథకాన్ని విజయవంతం చేయాలంటే అమలు కీలకం. సంస్థలు నిజంగా కొత్త ఉద్యోగులను నియమించగలవా? ఉద్యోగులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటారా? కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో పర్యవేక్షణ, గణాంకాల సేకరణ, మూల్యాంకన విధానాలు సమర్థవంతంగా అమలవుతాయా? ముఖ్యంగా చిన్న పట్టణాల్లో తక్కువ సాంకేతిక వనరులు ఉన్న చోట్లనైనా డీబీటీ ఆలస్యాలు లేకుండా అమలు చేయగలమా అన్నదే అసలైన పరీక్ష.

ప్రభుత్వం ఒక శక్తివంతమైన ఐటీ మౌలిక వ్యవస్థను, జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాలను, సేవా మద్దతు కేంద్రాలను, పబ్లిక్ డాష్‌బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విజ్ఞాన శిక్షణను అందుబాటులో ఉండే భాషలలో అందించకపోతే అది అవరోధంగా మారే ప్రమాదమూ ఉంది. ఈ పథకం భారత యువతకు, ముఖ్యంగా కొత్తగా ఉద్యోగం ప్రారంభించే వారికి ఒక నూతన మార్గాన్ని తెరుస్తోంది. ఉపాధి అనేది కేవలం జీవనాధారం కాదు. అది గౌరవానికి, భద్రతకు మార్గం. సంక్షేమం గణాంకాల్లో మాత్రమే కాకుండా ప్రతి ఇంట్లో పరిమళించాలన్న లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భారతదేశంలో ఉద్యోగాల రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని తెరిచే అవకాశం ఉంది.

(రచయిత: జనక మోహన రావు దుంగ)

Recent Post

Andhra Pradesh National