గత నెల 27వ తేదీన ప్రపంచం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు) దినోత్సవం జరుపుకుంది. ఈ సంవత్సరం వేడుకలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న శ్రామిక శక్తికి ఉపాధి కల్పనకై 2030 నాటికి 60 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సిన బృహత్ కర్తవ్యం ప్రపంచం ముందుంది. ఎంఎస్ఎంఈలు సరైన ప్రోత్సాహకాలు కరవై, ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.3 బిలియన్ మందికి ఉపాధులు కల్పిస్తున్నాయి. కోవిడ్ కాలం ఎంఎస్ఎంఈలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్దీపన పథకాల కింద అందుతున్న రుణాలు సహాయకారి అవుతున్నాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెంది భారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఊడుతుండగా, పునాదిస్థాయిలో ఉపాధి కల్పనకు తోడ్పడుతున్నవి ఎంఎస్ఎంఈలే. పేరు గొప్ప చూచి కార్పొరేట్లకు వందల వేల కోట్లు అప్పులిచ్చి అవి ఎగనామం పెడితే లబోదిబోమంటున్న బ్యాంకులు ఇతర ద్రవ్య సంస్థలు ప్రభుత్వ చల్లని చూపుతో 15-16 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ (రద్దు చేయడం కాదని వాదిస్తారు) చేసి, కస్టమర్లపై భారాలతో ఆ లోటు పూడ్చుకుంటున్నాయి. కానీ ఎంఎస్ఎంఈలకు రుణాల మంజూరుకు సవాలక్ష షరతులు, పరిమితులు విధించి ఆంట్రప్రొన్యూర్లను తమ చుట్టూ తిప్పుకుంటాయి. ఉపాధి కల్పనను పెంపొందించే నిమిత్తం ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలతో కూడిన పరపతి, మార్కెటింగ్ వసతులు అవసరం. ప్రభుత్వాల దృష్టి మారకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది.
మన దేశానికి సంబంధించి 2030 నాటికి 9 కోట్ల నుంచి 11.5 కోట్ల వరకు ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. 14.8 కోట్లు అవసరమని ఐఎంఎఫ్ అంచనా వేసింది. మన దేశంలో ఎంఎస్ఎంఈలలో 11 కోట్ల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఫార్మల్ (నియత) రంగంలోని మొత్తం ఉద్యోగాల్లో ఇవి దాదాపు 62 శాతం. ప్రపంచవ్యాప్తంగా చూచినట్లయితే వ్యాపారాల్లో 90 శాతానికి, ఉపాధుల్లో 60 నుంచి 70 శాతానికి, జీడీపీలో 50 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అవి ముఖ్యంగా పేదలు, మహిళలు, యువత, బలహీన తరగతులకు పనులు చూపుతూ సమాజాలకు వెన్నెముకగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో స్థానిక, జాతీయ, ఆర్థిక వ్యవస్థలకు ఆదాయ వనరుగా ఉన్నాయి. వర్ధమాన మార్కెట్లలో కల్పించే ప్రతి 10 నియత ఉద్యోగాల్లో 7 ఎంఎస్ఎంఈలలోనే. అయినా పెట్టుబడులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తక్కువ అభివృద్ధిలో ఉన్న దేశాల్లో ఈ సమస్య హెచ్చుగా ఉంది. 41 శాతం ఎంఎస్ఎంఈలు ఈ ఫిర్యాదు చేశాయి. మధ్యస్థాయి అభివృద్ధి దేశాల్లో 30శాతం, ఉన్నత ఆదాయ దేశాల్లో 15 శాతం మాత్రమే ఫైనాన్స్ సమస్య ఎదుర్కొంటున్నాయి.
ఈ ప్రపంచ సభకు ఐరాస ప్రధాన కార్యదర్శి గుట్రెస్ పంపిన సందేశంలో ఎంఎస్ఎంఈల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు. “తక్కువ వడ్డీ రుణాలు లభ్యం చేయడం, మార్కెట్ అవకాశాలు కల్పించడం, డిజిటల్ మౌలిక వసతులను, నైపుణ్యాలను పటిష్టం చేయడం, మెరుగుపరచడం ద్వారా ఎంఎస్ఎంఈల సాఫల్యతకు దోహదం చేయాలి” అన్నారు. ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ ఎఫ్ హాంగ్ బో ఉద్యోగాల కల్పనలో, సామాజిక న్యాయాన్ని ముందుకుగొని పోవడంలో ఎంఎస్ఎంఈల పాత్రను ప్రశంసించారు.
ఎంఎస్ఎంఈలు కేవలం గ్రోత్ ఇంజన్లు మాత్రమే కాదు, సామాజిక న్యాయానికి ప్రోత్సాహకారులు. ముఖ్యంగా నియత ఆర్థిక నిర్మాణాల నుంచి మినహాయించబడే స్త్రీలు, యువత, బలహీన తరగతులకు ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు సమ్మిళిత వృద్ధి, ఉపాధి కల్పన, హుందాతనంతో కూడిన పని చూపడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
మన దేశంలో ఈ దినాన్ని ‘ఉద్యామి భారత్ – ఎంఎస్ఎంఈ దినోత్సవం’గా పాటించారు. ఈ రంగంలో తమ సాఫల్యాలను ప్రభుత్వం ప్రదర్శించి గొప్పలు చెప్పుకుంది. అయితే గత దశాబ్దంగా అవి ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు ఆ రంగంలోని వారికి బాగా తెలుసు. ఈ రంగం భారతదేశ వృద్ధి గాథలో రెండవ ఇంజిన్ అని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రస్తుతించినప్పటికీ, కేటాయింపులకు వచ్చేసరికి అది పుర్రచెయ్యి విసురుడే. 2025-26 కేటాయింపు 2022-23 వాస్తవంగా ఖర్చు చేసిన దానికన్నా తక్కువగా ఉంది. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరం మేరకు లేదన్నది సత్యం. పునరాలోచించాలి.