prajapaksham

పెళ్లైన సాయంత్రానికే ప్రియుడితో పరారైన వధువు..

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని పెరంబూర్‌లో పెళ్లి రోజే ఓ నవ వధువు భర్తను వదిలేసి తన ప్రియుడితో పరారైన ఘటన కలకలం రేపుతోంది. పెరంబూర్ అంబేడ్కర్ నగర్‌కు చెందిన అర్చన అనే యువతికి మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్‌తో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం చెన్నైలోని బెసెంట్ నగర్ ఆలయంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత వధూవరులు ఇంటికి తిరిగివచ్చారు.

అలానే సాయంత్రం రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతుండగా, పెళ్లికూతురు అర్చన తన తల్లిదండ్రులకు “బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నాను” అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె వెంట కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. అయితే ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కాల్ చేసినా మొబైల్ ఫోన్ స్విచ్అఫ్‌ చేసి ఉండటంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తర్వాత విచారణ చేయగా, అర్చనకు ఎరుకంజేరికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలిసింది. పెళ్లి జరిగిపోయినప్పటికీ, తన ప్రియుడితోనే కలిసి జీవించాలనే ఉద్దేశంతో ఆమె ముందుగానే పరారయే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బ్యూటీ పార్లర్ అన్నదంతా ఒక నెపం మాత్రమే. అర్చన తన ప్రియుడితో కలిసి పరారైంది అన్న విషయం తేలడంతో వరుడు విజయకుమార్ మరియు అతని కుటుంబం తీవ్రంగా షాక్‌కు గురయ్యారు. దీంతో రిసెప్షన్‌ను కూడా రద్దు చేశారు.

ఈ సంఘటనపై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ నవ వధువు మరియు ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Recent Post

Andhra Pradesh National