భారతదేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా మీడియాలో వచ్చిన కథనాలు, బీజేపీ పార్టీ ఎమర్జెన్సీపై చేసిన విమర్శలు చూసిన తర్వాత, 1975లో జాతీయ ఎమర్జెన్సీ ఎందుకు విధించారని కొంతమంది కాలేజీ స్టూడెంట్స్, ఉద్యోగులు, మిత్రులు, సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్స్‌తో నేను మాట్లాడాను. చాలామందికి సరైన సమాధానం లేదు. కానీ ఎమర్జెన్సీలో ఏం జరిగిందనే విషయాలు సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్స్ మాత్రమే చెప్పగలిగారు. అందుకే ఈ ఆర్టికల్ రాయాలని అనిపించింది. అంతమాత్రం చేత నేనేం కాంగ్రెస్ అభిమానిని కాదు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ఉపయోగించి దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ ఏ పరిస్థితిలో విధిస్తారంటే: 1. యుద్ధం 2. బాహ్య తిరుగుబాటు 3. అంతర్గత తిరుగుబాటు. ఈ కారణాల వల్ల జాతీయ ఎమర్జెన్సీ విధిస్తారు. 1962లో చైనాతో యుద్ధం కారణంగా దేశంలో మొట్టమొదటిసారి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 అక్టోబర్ 26న ఎమర్జెన్సీ విధించి 1968 జనవరి 10 వరకు కొనసాగిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. పాకిస్తాన్‌తో బాహ్య తిరుగుబాటు కారణంగా 1971లో జరిగిన యుద్ధం వలన ఆనాటి రాష్ట్రపతి వి.వి.గిరి దేశంలో రెండో ఎమర్జెన్సీ విధించారు. కానీ ఈ రెండు ఎమర్జెన్సీల ప్రభావం ఆనాడు ప్రజల మీద పడలేదు. మూడవసారి ఎమర్జెన్సీ 1975 జూన్ 25న దేశంలో అంతర్గత తిరుగుబాటు కారణంగా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఇచ్చిన లేఖతో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ మచ్చ నేటికీ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంది. ఈ ఎమర్జెన్సీ గురించి కూడా దేశంలో మూడొంతుల మందికి తెలియదు. అసలు ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో సూక్ష్మంగా చూద్దాం.
ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు
1962, 1965లో చైనా మరియు పాకిస్తాన్‌తో యుద్ధాలు జరిగిన తరువాత భారతదేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అందువలన ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టాలనే ఉద్దేశ్యం, రైతులకు వ్యవసాయ లోన్లు కల్పించాలనే సంకల్పంతో ప్రధాని ఇందిరా గాంధీ 1969లో బ్యాంకుల జాతీయీకరణకి శ్రీకారం చుట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అందువలన 1969 బ్యాంకుల జాతీయీకరణ చట్టాన్ని చేసి అమలు చేశారు. టాటా, బిర్లాల డబ్బంతా ప్రైవేట్ బ్యాంకులలో ఉండటం వలన ఆ బ్యాంకులని జాతీయం చేయడంతో వారు ఇందిరాగాంధీని వ్యతిరేకించారు. ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ కూడా బ్యాంకుల జాతీయీకరణను వ్యతిరేకించారు. అందువలన ఆ ఆర్థిక శాఖను ఇందిరాగాంధీ తీసుకోవడంతో మొరార్జీ దేశాయ్ ఆ పదవికి రాజీనామా చేసి ఒక సిండికేటును ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పురుడు పోసుకుంది.
భారతదేశ స్వతంత్రానంతరం 550 స్వదేశీ సంస్థానాలు యూనియన్‌లో విలీనం అయ్యాయి. ఈ విలీనం సందర్భంగా ఆ సంస్థానాలకు చెందిన రాజవంశాల వారికి ప్రభుత్వం ప్రతినెల కొంత మొత్తాలలో రాజభరణం అందించేది. అటువంటి రాజభరణాలను 26వ రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ 1970లో రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ రాజభరణాల రద్దును కూడా సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఈ కారణంగా ఆ సంస్థానాధీశులు ఇందిరాగాంధీపై గుర్రుగా ఉండేవారు. ఒకప్రక్కన పారిశ్రామికవేత్తలు, మరోపక్కన సంస్థానాధీశులు, ఇంకోప్రక్కన పార్టీలో అసమ్మతి, జ్యుడిషియరీ చీకటి బోనులో సింహం లాగా ఆమెను కబళించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఈ యుద్ధం అనంతరం ఆర్థిక వ్యవస్థపై బాగా ఒత్తిడి పెరిగింది.
రాజకీయ సంక్షోభం, ఉద్యమాలు
అంతర్గతంగా విద్యార్థులు, కార్మికులు, ప్రతిపక్ష నాయకులు సమస్యలపై పోరుబాట పట్టారు. రాజకీయ నాయకుల మాటల ఖజానా నుంచి ఆమెపై విమర్శనాస్త్రాలు క్షిపణుల్లా దూసుకొచ్చాయి. జార్జి ఫెర్నాండెజ్ కార్మిక శ్రేణుల ప్రళయ ఘోషను వినిపిస్తూ వచ్చారు. ఆమెను సమస్యల సుడిగుండంలో నెట్టి ప్రత్యర్థులు అష్ట దిగ్బంధనం చేశారు. రాజకీయ సంక్షోభంతో పాటు అంతర్గత తిరుగుబాటుల కారణంగా ఆమెపై వ్యతిరేకత అగ్నికెరటాలై ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ తిరుగుబాటు కెరటాలు సునామీలా చుట్టుముట్టాయి. స్వాతంత్ర్య సమరయోధులు, మహాత్మా గాంధీ సమకాలీనులు అయిన జయప్రకాష్ నారాయణ్ ప్రజల సమస్యలను ‘సంపూర్ణ విప్లవం’ పేరుతో బిహార్‌లో ఉద్యమం తీవ్రతరం చేశారు. మరోపక్క గుజరాత్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచాలని ఉద్యమించారు. మామూలుగా సాగుతున్న ఈ పోరాటం జయప్రకాష్ నారాయణ్ జోక్యంతో తీవ్రరూపం దాల్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రం గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. మరోపక్క కార్మిక నాయకులు జార్జి ఫెర్నాండెజ్ కార్మిక ఉద్యమాలను తారాస్థాయికి తీసుకెళ్ళారు. జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవం పేరిట “పార్లమెంట్‌కు జనతా మార్చ్” పిలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఆయన ఇచ్చిన పిలుపు కారణంగా ఇందిరాగాంధీ ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ సమయంలోనే రైల్వే మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా బాంబు దాడిలో హత్య చేయబడడంతో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. గుజరాత్ లో విద్యార్థుల ఉద్యమం తరువాత 1974లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ఆమె తీవ్రమైన మనస్తాపానికి గురైంది.
అలహాబాద్ హైకోర్టు తీర్పు, పర్యవసానాలు
దేశ పరిస్థితులు ఇలా ఉన్న సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన రాజ్ నారాయణ్, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ 14 ఎలిగేషన్స్‌తో అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసులో 12 ఎలిగేషన్స్‌ను కొట్టివేస్తూ కేవలం 2 ఎలిగేషన్స్‌పై తీర్పునిచ్చింది: 1. ప్రభుత్వ అధికారి అయిన యశ్‌పాల్ కపూర్ ఉద్యోగానికి రాజీనామా చేసినా అది ఆమోదింపబడకముందే ఆయన ఇందిరాగాంధీ తరఫున ఎన్నికల్లో పాల్గొనడం. 2. ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ వేదికపై ప్రసంగించిన సందర్భంగా ఆ వేదికకు అయిన ఖర్చు మరియు విద్యుత్తు ఛార్జీలు ఉత్తర్‌ప్రదేశ్ గవర్నమెంట్ చెల్లించడం. ఈ రెండు కారణాలతో ఆమె ఎన్నిక చెల్లదని, 6 సంవత్సరాల పాటు ఎన్నికలలో పాల్గొనకూడదని తీర్పునిచ్చింది.
దీనిపై ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో రిట్ అప్పీల్ వేశారు. ఈ రిట్ అప్పీల్ స్వీకరించిన సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూనే ఆమె ప్రధానమంత్రిగా కొనసాగవచ్చునని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు రాగానే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్‌తో పాటు మితవాద ప్రతిపక్ష నాయకులందరూ పట్టుపట్టారు. “ఇప్పటినుండి ఇందిరాగాంధీని బయటకు లాగుదాం. రాజీనామా చేసేంతవరకు ఇంటినుండి ఆమెని బయటికి రానివ్వం. గృహనిర్బంధం చేస్తాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లెక్క చెయ్యం. ఆమె రాజీనామా చేయాల్సిందే” అని జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, జార్జి ఫెర్నాండెజ్, రామ్ నారాయణ్‌తో పాటు జనసంఘ్ పార్టీ కలిసి ఆమెను కార్నర్ చేశారు.
ఎమర్జెన్సీ ప్రకటన, పర్యవసానాలు
సమస్యలన్నీ చుట్టుముట్టడంతో 1975 జూన్ 25న రాష్ట్రపతికి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆమె లేఖ వ్రాశారు. ఆ ప్రకారంగా రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జూన్ 25 అర్థరాత్రి నుండి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాంతో దేశంలో 21 నెలల పాటు రాష్ట్రపతి పాలన అనంతరం ఇందిరా గాంధీయే ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలకు ఉత్తర్వులు చేశారు. తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఏకపార్టీ పాలనకు తెర పడింది. కాంగ్రెస్ పార్టీకి 154 స్థానాలు రాగా, కాంగ్రెస్(ఓ), స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ, జనసంఘ్‌లతో ఏర్పడిన జనతా పార్టీకి 295 స్థానాలు వచ్చాయి. కొత్తతరం నాయకులతో జనతాపార్టీ నుండి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా పదవి చేపట్టారు.
ఉత్తర భారతదేశంలో ఎమర్జెన్సీ అత్యాచారాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి వీచిన వ్యతిరేక పవనాలు దక్షిణ భారతదేశంలో లేవు. అంటే ఆ చీకటి రాత్రులు ఇక్కడ లేవా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 ఎంపీ స్థానాలకు 41 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఎమర్జెన్సీ ప్రభావం ఏమైనట్లు? జనతా పార్టీ ప్రభుత్వం అంతర్గత వైరుధ్యాలతో రెండేళ్లలో కూలిపోయింది.
1980లో మధ్యంతర ఎన్నికల్లో దేశ ప్రజలు ఇందిరాగాంధీకి మళ్ళీ పట్టం కట్టారు. దేశంలో ఎమర్జెన్సీని ఓ బ్లాక్ డేగా ప్రస్తుతం బీజేపీ వారు చూపుతున్నా, ఆనాడు కాంగ్రెస్‌కు 34.5 శాతం ఓట్లు వచ్చాయి. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీకి 36.6 శాతం ఓట్లు వచ్చాయి. ఆ విధంగా చూస్తే బీజేపీది కూడా చీకటి పాలనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకేనేమో దేశంలో ప్రస్తుతం బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులకు, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు పెద్ద తేడా ఏమీ లేదు.